Loading...

25, సెప్టెంబర్ 2025, గురువారం

ఆశ తీరదు

 తెలుపునఁ దేలు మరాళముపైని సతీ సరస్వతి రూపముం
దలచి యొకింత విశేషపు భంగిఁ బదమ్ముఁ బాడగనెంచితీ
యలసట తక్క కృతార్థత కల్గక యాశతీరదు, శుద్ధమౌ
లలిత పదాళిని ధారనొసంగు విలాసమెన్నడు జూపెదో!

 

-- లక్ష్మీదేవి.
వనమంజరి 

24, సెప్టెంబర్ 2025, బుధవారం

సరస్వతీ!

 కంటికి కానరాదెచట, గంధము దాచుట క్లిష్టమౌ, సదా
కంటకఛేదియై యొనరు, గౌరవమెప్పుడు వృద్ధిఁజేయు, తా
వెంటను వచ్చునెన్నటికి, ప్రీతినిఁ బంచిన హెచ్చు, నట్టి సొ
త్తంటి సువిద్యనిత్తువని తల్లి సరస్వతి! నిన్ను చేరుదున్.

 

-- లక్ష్మీదేవి.

ఉత్పలమాల 

సద్యోజాత

 తల్లీ! దండములమ్మ ! నవ్యనవనీతంబైన సింగారమై
కల్లోలంబుల పాల సంద్రమున, బంగారంపు పూబంతివై
యుల్లాసమ్ముగ నేల గర్భమున, సద్యోజాత సన్మూర్తివై
ఫుల్లాబ్జాక్షి జనించి, శ్రీహరిని సమ్మోహించి చేబట్టితే!

 

-- లక్ష్మీదేవి.
శార్దూలవిక్రీడితము
 

22, సెప్టెంబర్ 2025, సోమవారం

మనోజ్ఞ

 కమలమవై విలసిల్లి కాంతుని సేవకై

భ్రమరమువై తపియించి బాధలకోర్చు నీ

సమమెవరే సిరిదేవి, చంద్రుని సోదరీ!

సుమములతో కయిమోడ్తు, జోతలఁగొనుమా!

 

-- లక్ష్మీదేవి.
మనోజ్ఞవృత్తము 

పెంజీకటి

 పరిచయమైన రూపు, పసిపాపనుఁ బోలిన నవ్వు, చల్లనై
విరిసిన కంటిచూపు, కడు భీతినిఁ బారగఁ ద్రోలు శౌర్యముం,
దరగని కాంతితోపు ముఖదర్శనమెల్లను వీడి, జ్ఞానియై
చిరు దరహాస ముద్రఁ బెనుఁ జీకటికవ్వలి కాంతిఁ దల్చుటో!!

 

-- లక్ష్మీదేవి.
ఉత్పలమాల
 

18, సెప్టెంబర్ 2025, గురువారం

దిక్కెవ్వరో!

 మోహావేశముతో భ్రమించి జగతిన్మూర్ఖమ్ముగా నమ్ముచున్
బాహాటమ్ముగ నేఱరానివగు దుర్వారంపు లోకుట్రలన్
దేహాత్మల్ బలియైన వేళ నకటా! దిక్కెవ్వరో స్వామి! నీ
సాహాయ్యమ్మునుఁ గాక నాకు, కలదా సందేహమింతైననున్.

-లక్ష్మీదేవి

శార్దూలవిక్రీడితము

15, సెప్టెంబర్ 2025, సోమవారం

ద్వ్యా

 సద్వ్యాసంగములందు నుండగల యిచ్ఛాశక్తి సంకల్పమున్,
సద్వ్యూహమ్ములతోడ యత్నమును,సంస్కారంపుసంసర్గమున్
హృద్వ్యాధ్యాదులనుండి రక్షనిడు నే యే ప్రాయమందైన, నీ
షద్వ్యంగమ్మును లేదు, సత్యమిది విశ్వాసమ్ము నీవుంచుమా.


- లక్ష్మీదేవి

శార్దూలవిక్రీడితము

ద్వ్యా ప్రాస



27, ఆగస్టు 2025, బుధవారం

వినాయకా

 ఏనుగుమోమునేర్పడగ నిమ్మడి శోభల మూర్తి పూజకై 

జానుతెనుంగు పద్యములఁ జక్కగఁ బాడు నొకింత నేర్పుకై 

యేను వినమ్రతన్నిలుతు నియ్యెడ స్వామి వినాయకా! వెస

న్కానుకఁ, గోరు చందమున కైగొన నిచ్చి యనుగ్రహింపుమా!


-లక్ష్మీదేవి 

ఉత్పలమాల 


6, ఆగస్టు 2025, బుధవారం

అంకితం


 

4, ఆగస్టు 2025, సోమవారం

జోలాలి

 జోలాలి పాడేను ఊపేను ఊయలను

బజ్జోర చిన్నారి జో జో జో ।

జో జో జో ।


సిరినవ్వు కాంతులను వెలిగించి మనుమయ్య జో జో జో

శాంతమ్ము సిరి సుఖము నిరతమ్ము కనుమయ్య జో జో జో


జో లాలి పాడేను ఊపేను ఊయలను

బజ్జోర చిన్నారి జో జో జో ।


ముద్దార ఒడిఁజేర్చి లాలింతు బుజ్జాయి జో జో జో

నిదురమ్మ వేచేను కలలల్లి వరమాల జో జో జో


జోలాలి పాడేను ఊపేను ఊయలను

బజ్జోర చిన్నారి జో జో జో ।

జో జో జో ।


- లక్ష్మీదేవి.

2, ఆగస్టు 2025, శనివారం

నీ వలెనే

 శఠులును లోకకంటకులు స్వార్థముఁ బూని తపమ్ముఁ జేయుచు
న్హఠమునుఁ బూనినప్పుడును నచ్చెరువొప్పగ నార్తిఁదీర్తువే?
కఠినతరంపునిష్ఠఁగొని గౌరి కడుంగడు దీక్షఁగొల్వగా
తుఠరపు మాటలాడితివి, దూఱితివే? తగునా మహేశ్వరా?

-లక్ష్మీదేవి.
చంపకమాల 

30, జులై 2025, బుధవారం

మోహం

 విడువక మోహజాలములు వేయివిధమ్ములఁ జిక్కబట్టగా

సడలునె బంధపాశములు? సాధ్యము కాదిట నిల్చిగెల్వగాఁ,

దడబడకుండగా, నడక తప్పక ముందుకు నేగ, మాటికి

న్ముడిపడు తీవలై కనుల ముందటి దారులు భ్రాంతిఁగొల్పగా.


- లక్ష్మీదేవి.

చంపకమాల.


19, జులై 2025, శనివారం

నీలోత్పల

 నీలిమ వర్ణమై పరవి నింగిని నిండితి నిర్మలమ్ముగా

నీలిమ వర్ణమై కనుల నిల్చితి నిట్టులె నిశ్చలమ్ముగా

నీలిమ వర్ణమై కదలు నీరధిఁ దేలి మరింత మక్కువ

న్నీలిమ వర్ణమై మెరిసి నీ దరిఁ జేరితి నీలమాధవా!  


-లక్ష్మీదేవి

నీలోత్పలమాల 


నీలమాధవుడని జగన్నాథునికి పేరు.

18, జులై 2025, శుక్రవారం

16, జులై 2025, బుధవారం

ఊచేము


 పురందరదాసు కీర్తన - లాలిపాట

-----------------------------


ఉయ్యాలలూచేము రంగడిని, కృష్ణుడిని

ఊచేము అచ్యుతానంతుని

ఊచేము వరగిరి యప్ప తిమ్మప్పను

ఊచేము కావేరి రంగయ్యను


నాగలోకమందు నారాయణుడని యెంచి 

నాగకన్యకలెల్ల ఊచేము

నాగవేణులంతా నెనపు నెనరూలుంచి

వేగమే ఉయ్యాలలూచేము


ఇంద్రలోకమందుపేంద్రుడని యెంచి

ఇందుముఖులము మేము ఊచేము

ఇంద్రకన్యకలెల్ల చక్కగ ముందుకు వచ్చి

ముకుందుని ఉయ్యాలలూచేము


తేలే పత్రము మీది శ్రీలోలుడని యెంచి

నీలకుంతలలెల్ల ఊచేము

వ్యాళశయనుడు హరి శయనించెనని యెంచి

బాల కృష్ణయ్యను మేము ఊచేము


తలను పింఛములాడ ముత్యపు హారములూగ

శిశువును ఉయ్యాలలూచేము

సిరిదేవి రమణుని పురందర విఠలుని

కరుణను లాలించి ఊచేము


కొంచెం దగ్గరి తెలుగు రూపం - లక్ష్మీదేవి.

8, జులై 2025, మంగళవారం

అకటా!

 గర్వమ్మెల్లను వీడెనోయి, యిటులీ గాఢాంధకారమ్ములో

పూర్వజ్ఞాపకమించుకైన కలతన్ పోగొట్టజాలంగదే!

యుర్విన్జీవము నుండరాదు, నకటా! యుచ్ఛ్వాస నిశ్వాసము

న్నిర్వేదమ్మునుఁ బూనరాదు మదిలో నిత్యమ్ము నీవుండగా. 


-లక్ష్మీదేవి.

శార్దూలవిక్రీడితము.



27, జూన్ 2025, శుక్రవారం

రథయాత్ర

ఇలపై వావిరి చక్రముల్ కదలగా నింపైన దృశ్యమ్ముగాఁ
దులలేనట్టి మహోత్సవంబొకటి, సందోహమ్ముగాఁ జేరుచు
న్నలలై పొంగు జనాళితో జరుగ, నేనచ్చెర్వుతో భక్తితోఁ
గలయో వైష్ణవ మాయయో యనుచు నా కన్నారగాఁ గాంచితిన్.


-లక్ష్మీదేవి.

మత్తేభవిక్రీడితము

16, మే 2025, శుక్రవారం

వీరులు

 గుప్పెడు దేశభక్తిఁ గడు క్రూరపు పాలనఁ ద్రుంచగల్గుట

న్ముప్పగు పీడనమ్ముల విమోచనమందగఁ గోరి, వీరత

న్తప్పులఁ జేయు ధూర్తతను ధ్వంసముఁ జేయుట, పారఁ ద్రోలుట

న్గొప్పగఁ జెప్పుకుందు పదికోటుల మారులు గౌరవమ్ముతో. 


-లక్ష్మీదేవి

ఉత్పలమాల

2, మే 2025, శుక్రవారం

శంకరజయంతి

 

భరతవర్షమ్మెల్లఁ బాడిగా నడయాడి
ధర్మపీఠ వితతి దారిఁ జూపి
కవనధారలయందు కైవల్యగతినిచ్చి
కనకధారలయందు కరుణఁ జూపి
విబుధసంఘముల వివేచనమునుఁ బెంచి
కపటమ్ములెఱుగని గరిమఁ జూపి
లేత ప్రాయమునందె లిప్తలోనఁ దనువు
వీడదల్చె గురువు విలువఁ జూపి
 
 
శంకరుండు బుధుల శంకలెల్లనుఁ దీర్చ
వంకలెల్లఁదీర్చఁ బంతమూని
కంకణమ్ముఁ గట్టి కంటకమ్ములఁ దాటి
జంకుఁ దోల గహన చర్చఁ జేసె.

- లక్ష్మీదేవి.
సీసపద్యము, ఆటవెలది పద్యము.

26, మార్చి 2025, బుధవారం

జననికి

 ఒడి సింహాసనమై కరమ్ము గొడుగై యుప్పొంగు సౌభాగ్యమై
సడి సేయంగ నివాసమెల్ల వెలుగై సంతోషముల్దండియై
కడు పుణ్యమ్ముల పంటయై జననికే గారంపు బంగారమై
ముడి పువ్వే నెమలీకయై యలరెనీ బుజ్జాయి శ్రీకృష్ణుడై.


- లక్ష్మీదేవి.

మత్తేభవిక్రీడితము.

14, మార్చి 2025, శుక్రవారం

స్వామి

నీలి నీలాల రాశిలో నిగ్గుఁదేలి
దేవనీలమ్ము వైవెల్గు దీనబంధు, 
శేషశయనాల కొలువైన శాంతశీలి,
గరుడునారూఢువగు రూపు కనులవిందు. 

--లక్ష్మీదేవి 
తేటగీతి 

13, జనవరి 2025, సోమవారం

చలిగాలులు

 

లిగాలుల పులికోరలు డిపించెడు వనిలో
పుకింతల కదలాడుచు మురిపించెడు తరువు
ల్తికింపగ కనువిందుగ దివియో నిది యనగా
పొక్కటి మదిలోపల రహాసమునిడెనోయ్. 
 
-లక్ష్మీదేవి.
శివశంకర వృత్తము.