జీవనమునఁ గలిమియు బలిమియునిడి సేమములనుఁ గరుణనొసగు నీ
పావనమగు నిజ ముగమునుఁ గనఁగల భాగ్యములను నడిగెద, మది నీ
కోవెలవలె నిలుపగఁ దగు గుణములఁ గోరెద, జగములు నిరతము నీ
దీవనలను సుఖముగ మనఁగలుగుట దీక్షనుఁ గొని నడిగెద హిమజా!
వెన్నెల లలిగా పేరుచు, రే జిప్పిలు నిరులనుఁ జూపెడి వెలుగులలో
పున్నెపు సిరిగా నేలిన దైవమ్మును శరణని, శేముషి నిడుమని నే
విన్నపమిడగా దీవనగా దిగ్విజయ పథముఁ బంపెడి జననివి, ని
న్నెన్నడు విధిగాఁ గొల్చెదనమ్మా! యినుమడిగను రేయిని పగళులలో.
లాక్షణీ వృత్తము
విజయ వృత్తము