Loading...

30, జులై 2025, బుధవారం

మోహం

 విడువక మోహజాలములు వేయివిధమ్ములఁ జిక్కబట్టగా

సడలునె బంధపాశములు? సాధ్యము కాదిట నిల్చిగెల్వగాఁ,

దడబడకుండగా, నడక తప్పక ముందుకు నేగ, మాటికి

న్ముడిపడు తీవలై కనుల ముందటి దారులు భ్రాంతిఁగొల్పగా.


- లక్ష్మీదేవి.

చంపకమాల.


19, జులై 2025, శనివారం

నీలోత్పల

 నీలిమ వర్ణమై పరవి నింగిని నిండితి నిర్మలమ్ముగా

నీలిమ వర్ణమై కనుల నిల్చితి నిట్టులె నిశ్చలమ్ముగా

నీలిమ వర్ణమై కదలు నీరధిఁ దేలి మరింత మక్కువ

న్నీలిమ వర్ణమై మెరిసి నీ దరిఁ జేరితి నీలమాధవా!  


-లక్ష్మీదేవి

నీలోత్పలమాల 


నీలమాధవుడని జగన్నాథునికి పేరు.

18, జులై 2025, శుక్రవారం

16, జులై 2025, బుధవారం

ఊచేము


 పురందరదాసు కీర్తన - లాలిపాట

-----------------------------


ఉయ్యాలలూచేము రంగడిని, కృష్ణుడిని

ఊచేము అచ్యుతానంతుని

ఊచేము వరగిరి యప్ప తిమ్మప్పను

ఊచేము కావేరి రంగయ్యను


నాగలోకమందు నారాయణుడని యెంచి 

నాగకన్యకలెల్ల ఊచేము

నాగవేణులంతా నెనపు నెనరూలుంచి

వేగమే ఉయ్యాలలూచేము


ఇంద్రలోకమందుపేంద్రుడని యెంచి

ఇందుముఖులము మేము ఊచేము

ఇంద్రకన్యకలెల్ల చక్కగ ముందుకు వచ్చి

ముకుందుని ఉయ్యాలలూచేము


తేలే పత్రము మీది శ్రీలోలుడని యెంచి

నీలకుంతలలెల్ల ఊచేము

వ్యాళశయనుడు హరి శయనించెనని యెంచి

బాల కృష్ణయ్యను మేము ఊచేము


తలను పింఛములాడ ముత్యపు హారములూగ

శిశువును ఉయ్యాలలూచేము

సిరిదేవి రమణుని పురందర విఠలుని

కరుణను లాలించి ఊచేము


కొంచెం దగ్గరి తెలుగు రూపం - లక్ష్మీదేవి.

8, జులై 2025, మంగళవారం

అకటా!

 గర్వమ్మెల్లను వీడెనోయి, యిటులీ గాఢాంధకారమ్ములో

పూర్వజ్ఞాపకమించుకైన కలతన్ పోగొట్టజాలంగదే!

యుర్విన్జీవము నుండరాదు, నకటా! యుచ్ఛ్వాస నిశ్వాసము

న్నిర్వేదమ్మునుఁ బూనరాదు మదిలో నిత్యమ్ము నీవుండగా. 


-లక్ష్మీదేవి.

శార్దూలవిక్రీడితము.